యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2023 మూడో త్రైమాసికం నుంచి ప్రత్యేక వర్క్ పర్మిట్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. దేశంలో అన్ని నైపుణ్యాలు ఉన్నవారు ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా ఫ్లెక్సిబుల్ వర్క్ పర్మిట్లు తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ ఫ్రీలాన్స్ వర్క్ పర్మిట్లతో యూఏఈ లో లేదా ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి అయినా పని చేయడానికి వీలు ఉంటుంది. దుబాయిలో జరిగిన రిమోట్ ఫోరం సమావేశంలో ఎమిరేటైజేషన్ మినిస్టర్ అబ్దుల్ రెహ్మన్ అల్ అవార్ మాట్లాడుతూ అన్ని నైపుణ్య స్థాయిల వారి కోసం ఫ్రీలాన్సింగ్ వర్క్ పర్మిట్లను పరిచయం చేస్తున్నాం. అధిక నైపుణ్యం కలిగిన వ్యక్తులతో పాటు తక్కువ నైపుణ్యం ఉన్నవారు కూడా తమ కోసం పని చేయడానికి, ఇతరులతో కలిసి పని చేయడానికి అనువైన వర్క్ పర్మిట్లను కలిగి ఉంటారు అని అన్నారు.ఇటువంటి సౌకర్యవంతమైన పని అవకాశాలతో వచ్చే ఏడాది నాటికి 24వేల ఉద్యోగాలు సృష్టించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం మినిస్ట్రీలో 200 మంది రిమోట్ గా పని చేస్తున్నారని, వీరిలో పురుషులు, మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఇక తాజాగా ప్రకటించిన ఫ్రీలాన్స్ వర్క్ పర్మిట్ల ద్వారా 24వేల ఉద్యోగావకాశాలు కల్పించి శ్రామిశక్తిని పెంచుకోవడంతో పాటు మూలధననాన్ని సమకూర్చుకోవడం జరుగుతుందన్నారు.