పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవంగా ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఈ అవార్డులను అందజేశారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎమ్ కృష్ణ, పారిశ్రామిక వేత్త కుమార్ మంగళం బిర్లా, నేపథ్య గాయకుడు సుమన్ కళ్యాణ్పూర్, ఆధ్యాత్మిక వేత్త కమలేశ్ డి పటేల్ పద్మపురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ నుంచి డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ బండి రామకృష్ణారెడ్డి, కమలేశ్ డీ పటేల్ పద్మపురస్కారాలు అందుకున్నారు. వృద్ధాప్యం కారణంగా నడవడానికి ఇబ్బంది పడిన సుమన్ కళ్యాణ్పూర్కు పద్మ భూషణ్ పురస్కారం అందించడానికి రాష్ట్రపతి ముర్ము ముందుకు కదలి వచ్చారు. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవ మొదలైన వివిధ రంగాలలో ఈ అవార్డులు ఇవ్వబడ్డాయి. పద్మ అవార్డులు 2023 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించబడ్డాయి. రాష్ట్రపతి అందజేసిన పద్మ అవార్డుల జాబితాలో 6 పద్మవిభూషణ్, 9 పద్మభూషణ్, 91 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. మొత్తం 54 మందికి పద్మ పురస్కారాలు అందించారు. మిగతావారికి మరొక కార్యక్రమంలో అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
