రామ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీలీల నాయికగా నటిస్తున్నది. తాజాగా కొత్త పోస్టర్ షేర్ చేస్తూ ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నాడు రామ్ పోతినేని. వస్తున్నాం. ఈ అక్టోబర్‌లో కలుద్దాం.. అని క్యాప్షన్ ఇచ్చాడు. స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న రామ్ ఓ గుడి ముందు భారీ దున్నపోతు ముక్కుతాడు పట్టుకొని వస్తున్న స్టిల్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పండుగ సంబురాల్లో ఓ పోరాట ఘట్టం..అందులో కథానాయకుడు పౌరుషంగా కదులుతున్న ఈ స్టిల్ ఆకట్టుకునేలా ఉంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాలు జోడిస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్సులతో పాటు పాటలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో నటించే యాక్టర్లు , సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.