దగ్గుబాటి కుటుంబంలో విషాదం నెలకొంది. టాలీవుడ్ యాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్ బాబాయి, మూవీ మొఘల్, దివంగత నిర్మాత రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్ బాబు ఇవాళ బాపట్ల జిల్లా కారంచేడులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే నిర్మాత సురేశ్ బాబు కారంచేడుకు వెళ్లారు. అయితే వెంకటేశ్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్న కారణంగా రేపు ఉదయం కారంచేడుకు వెళ్లే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దగ్గుబాటి మోహన్ బాబు మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దగ్గుబాటి మోహన్ బాబు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రదిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మోహన్ బాబు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.