పోర్న్‌స్టార్‌కు చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టుకు హాజరైన ట్రంప్ ముందుగా డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో లొంగిపోయారు. దీంతో ట్రంప్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నట్టు కోర్టు పరిగణించింది. విచారణ అనంతరం కోర్టు ఆయనను కస్టడీ నుంచి విడుదల చేసింది. డిసెంబర్ 4న మరోసారి ఆయనను కోర్టు విచారించనుంది. హష్ మనీతోపాటు మొత్తంగా ట్రంప్‌పై 34 అభియోగాలు నమోదయ్యాయి. కాగా, తనపై క్రిమినల్ అభియోగాలు మోపడం అమెరికాకే అవమానమని ట్రంప్ వ్యాఖ్యానించారు.

కోర్టు నుంచి వెళ్లిన తర్వాత ఫ్లోరిడాలోని తన నివాసం వద్ద మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ మన దేశం నాశనం అవుతున్నదని, నరకానికి వెళ్తుందని బైడెన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అఫ్గానిస్థాన్ నుంచి మన బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ప్రపంచం మనల్ని చూసి నవ్వుతున్నదని విమర్శించారు. మనం మన దేశాన్ని రక్షించుకోవాలి. అమెరికాలో ఇలాంటివి జరుగుతాయని తానెప్పుడూ అనుకోలేదన్నారు. ఇది దేశానికి అవమానం అని చెప్పారు. దేశాన్ని నాశనం చేయాలనుకునేవారి నుంచి రక్షించేందుకు ప్రయత్నించడమే తాను చేసిన నేరమని వెల్లడించారు. 2024 ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు తనపై ఈ తప్పుడు కేసు పెట్టారని, వెంటనే దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
