రాఘవ లారెన్స్, ప్రియ భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రుద్రుడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు కతిరేసన్ రూపొందిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై ఠాగూర్ మధు తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత ఠాగూర్ మధు మాట్లాడుతూ ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలున్న చిత్రమిది. మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. లారెన్స్ కెరీర్‌లో ఇదొక ప్రత్యేక చిత్రంగా మిగిలిపోతుంది అన్నారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ ఈ కథను దర్శకుడు కతిరేసన్ అద్భుతంగా చెప్పారు. ఇందులో కుటుంబ నేపథ్యం ఆకట్టుకుంటుంది. మదర్ సెంటిమెంట్ కదిలిస్తుంది. మాస్, యాక్షన్, డాన్స్ వంటి కమర్షియల్ అంశాలన్నీ ఉంటాయి. నాయిక ప్రియ భవానీ శంకర్ క్యారెక్టర్ బాగుంటుంది. మూడేండ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాతో మీ ముందుకొస్తున్నాను. సినీ ప్రయాణం కొనసాగిస్తూనే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అని అన్నారు. ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ రుద్రుడు సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. లారెన్స్ గారికి కృతజ్ఞతలు. మీ అందరూ కుటుంబంతో సహా చూడాలి అని కోరారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 14న విడుదల కానుంది.


