అమెరికాలో ఓ రిటైర్డ్ మెకానిక్ పంట పండింది. ఎలాంటి శ్రమ లేకుండానే ఏకంగా వందల కోట్ల రూపాయలు ఆయన సొంతమయ్యాయి. 61 ఏండ్ల ఎర్ల్ లాపే అనే వ్యక్తి అయోవా రాష్ట్రంలోని డబ్యూక్ నగరంలో నివాసం ఉంటున్నాడు. అతను ఓ రిటైర్డ్ మెకానిక్. ఏప్రిల్ ఫూల్స్ డే (ఏప్రిల్ ఒకటో తేదీ) నాడు లొట్టో అమెరికా అనే లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అదృష్టవశాత్తు ఆ లాటరీలో ఎర్ల్‌లాపేకి 40 మిలియన్ డాలర్లు బహుమతిగా లభించాయి. క్లైవ్‌లోని అయోవా లాటరీ కేంద్ర కార్యాలయంలో బహుమతిని స్వీకరించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ లాటరీ గెలుచుకోవడం ఓ కలలా అనిపించింది. విషయం తెలిసిన వెంటనే ఇదో జోక్ అనుకున్నాను. ఏప్రిల్ ఫూల్ అవుతానేమోనని అంటూ గట్టిగా నవ్వేశాడు.

తనకు లభించిన ఈ డబ్బును కుటుంబ అవసరాలకు ఖర్చు చేయడంతోపాటు, ఆరోగ్య సమస్యలతో బాధపడే చిన్నారులను ఆదుకునేందుకు ఖర్చు చేస్తానని ఈ సందర్భంగా లాపే తెలిపారు. కాగా, తనకు బహుమతిగా వచ్చిన మొత్తాన్ని ఒకేసారి తీసుకున్నారు ఎర్ల్ లాపే. దీంతో అతడికి 21.28 మిలియన్ డాలర్లు మాత్రమే లభించాయి. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.174 కోట్లు అన్నమాట. అలా కాకుండా ఏడాదికి కొంత మొత్తం చొప్పున తీసుకుంటే 29 సంవత్సరాల్లో 40 (రూ.328 కోట్లు) మిలియన్ డాలర్లూ లభించేవి.

