సీనియర్ నటుడు శరత్‌బాబు(71) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో భాదపడుతన్న శరత్‌బాబు మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శరత్ బాబు గత నెల రోజులగా ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం ఉదయం నుంచి ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. మృత్యువుతో పోరాడి చివరకు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో తుది శ్వాస విడిచారు.
1973లో రామరాజ్యం అనే సినిమాతో శరత్‌బాబు వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత మూడేళ్లకు రాజా సినిమాలో అడ్వకేట్ రాము పాత్రలో నటించారు. ఈ సినిమా శరత్‌బాబుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో అవకాశాలు క్యూ కట్టాయి. అప్పుడే కే. బాలచందర్, శరత్‌బాబును చూసి తను డైరెక్ట్ చేస్తున్న పట్టిన ప్రవేశం అనే తమిళ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కూడా శరత్‌బాబుకు తమిళ్‌లో మంచి క్రేజ్ పెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో తెగ బిజీ అయిపోయారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా గడిపేవారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించాడు.
కెరీర్ మొదట్లో ఏడాదికి పది, పదిహేను సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు. ఇక తెలుగులో శరత్‌బాబు చివరగా వకీల్‌సాబ్ సినిమా చేశారు. ఈ సినిమాలో శరత్‌బాబు డిసిప్లైన్ కమిటీ చైర్మన్ పాత్రలో నటించారు. ఇక ప్రస్తుతం ఆయన నటించిన మళ్లీ పెళ్లి రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా శరత్‌బాబు చెదిరిపోని ముద్ర వేసుకున్నాడు. ముఖ్యంగా ఈటివీలో 1977లో వచ్చిన అంతరంగాలు సీరియల్ శరత్‌బాబును బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఆ తర్వాత జనని, అగ్నిగుండాలు సీరియల్స్ కూడా శరత్‌బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
సీనియర్ నటుడు శరత్‌బాబు మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 220కిపైగా చిత్రాల్లో నటించిన శరత్‌బాబు మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అని సీఎం అన్నారు. శరత్‌బాబు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా ఏ పాత్రలోనైనా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు శరత్ బాబు. తెలుగుతో పాటు వివిధ భాషల చిత్రాల్లో నటించారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు. శరత్ బాబు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.