సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటిస్తున్న చిత్రం టక్కర్. కార్తీక్ జి క్రిష్ దర్శకుడు. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టక్కర్ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన కయ్యాలే, పెదవులు వీడి మౌనం పాటలు కూడా విశేష ఆదరణ పొందాయి.

తాజాగా ఈ సినిమా నుంచి ఊపిరే అనే పాటను విడుదల చేశారు. కృష్ణకాంత్ రచించిన ఈ పాటకు నివాస్ కె ప్రసన్న స్వరాల్ని అందించారు. ప్రేమలోని మధుర భావాల్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. దర్శకుడు మాట్లాడుతూ రొమాంటిక్ యాక్షన్ చిత్రమిది. సిద్ధార్థ్ పాత్ర మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుంది. సిద్దార్థ్ కెరీర్‌లో ఓ విభిన్న చిత్రంగా నిలిచిపోతుంది అన్నారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: వాంచినాథన్ మురుగేశన్, సంగీతం: నివాస్ కె ప్రసన్న, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన-దర్శకత్వం: కార్తీక్ జి క్రిష్.

