రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, నీల ప్రియా, మిర్చి కిరణ్, హర్ష వర్ధన్ ప్రధాన పాత్రల్లో డియర్ జిందగి అనే సినిమా షురూ అయింది. ఈ చిత్రం ద్వారా పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) దర్శకునిగా పరిచయమవుతున్నారు. రాజా రవీంద్ర సమర్పణలో ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభం అయింది. తొలి సీన్‌కి దర్శకుడు కల్యాణ్ కృష్ణ కెమెరా స్విచ్చాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించగా, డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజా రవీంద్ర మాట్లాడుతూ ఇందులో ముగ్గురు పిల్లల తండ్రి పాత్రలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేస్తున్నాను అన్నారు. పద్మారావ్ అబ్బిశెట్టి మాట్లాడుతూ మధ్య తరగతి వారికి మా సినిమా కచ్చితంగా నచ్చుతుంది అన్నారు. అనంతరం శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ ప్రేక్షకులకు మంచి కాన్సెప్ట్ సినిమాను అందించాలనే ఉద్దేశంతో స్నేహితులతో కలిసి ఈ బ్యానర్‌ని స్థాపించాను అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు శివచందు, యశస్విని, నీల ప్రియ, ఛాయాగ్రాహకుడు సిద్ధార్థ స్వయంభు, గీత రచయిత రాంబాబు గోసాల, సహ నిర్మాత క్రాంతి ముండ్ర తదితరులు పాల్గొన్నారు.


