నేల ఈనిందా, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు మన శకపురుషుడు, అన్న రామన్న శతజయంతోత్సవాలకి ఆస్ట్రేలియాలోని తెలుగు వారు హాజరయ్యారు. రామాయణం ఎన్నిసార్లు విన్నా, శ్రీరాముణ్ని ఎన్ని సార్లు స్మరించుకొన్నా తనివి తీరదు అంటారు. అదే విధంగా మన అన్న రాముని చరిత్రని ఎన్నిసార్లు చెప్పుకొన్నా, తారకరామున్ని ఎంత పొగుడుకొన్నా తృప్తి ఉండదని నిరూపించారు.


ఆస్ట్రేలియాలో వివిధ రంగాలలో విశేష సేవలు అందించే తెలుగువారిని గుర్తించి ఎన్టీఆర్ అవార్డులతో సత్కరించే తెలుగుదేశం ఆస్ట్రేలియా సంస్థ 2023 సంవత్సరానికి కార్డియో వాస్క్యూలర్ వ్యాధి నివారణకు విశేష కృషి చేసిన ప్రముఖ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ క్లారా చౌ మరియు పబ్లిక్ సర్వీసెస్, జ్యూడిషరీ రంగాలలో అందించిన సేవలకు గాను న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర జ్యూడిషరీ కమిషన్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ. మురళి సాగి గార్లను ఎన్టీఆర్ అవార్డులతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించిన డాక్టర్ క్లారా చౌ తెలుగింటి కోడలు కూడా. ఈ సందర్భంగా డాక్టర్ క్లారా తనకు ఆంధ్రప్రదేశ్ తో ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకున్నందుకు సంతోషం వ్యక్తం చేసారు. ఎన్టీఆర్ అభిమానిని అయిన తాను నేడు ఎన్టీఆర్ అవార్డును అందునా అయన శతజయంతి సందర్భంగా అందుకోవటం తన అదృష్టమని శ్రీ మురళి సాగి పేర్కొన్నారు.


సుమారు ఆరు గంటల పాటు జరిగిన ఈ సంబరం లో 1600 వందల మందికి పైగా పాల్గొన్నారు అందరికి రుచికరమైన భోజనాలు వడ్డించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ తెలుగుదేశం ఆస్ట్రేలియా తరపున ధన్యవాదాలు తెలియజేశారు ఇలాటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

