బీఆర్ చోప్రా రూపొందించిన మహాభారత్ సీరియల్‌లో శకుని పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ నటుడు గుఫీ పైంతాల్ (79) ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గుఫీ పైంతాల్ మహాభారత్‌తో పాటు పలు టీవీ సీరియల్స్‌లో నటించారు. బహదూర్ షా జఫర్, కానూన్, ఓం నమః శివాయ, సీఐడీ, కోయి హై ద్వారకాధీష్ భగవాన్ శ్రీకృష్ణ, రాధాకృష్ణ, జే కనియా లాల్ వంటి ధారావాహికల్లో తనదైన నటనతో మెప్పించారు. రఫూ చక్కర్ (1975) చిత్రంతో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన దిల్లగి, దేశ్ పరదేశ్, సుహాగ్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. గుఫీ పైంతాల్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ముంబయి అంధేరి శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు.