ఆహా ఓటీటీలో నిర్వహించిన సంగీత ప్రధాన రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్-2023 కార్యక్రమం ముగిసింది. టైటిల్ కోసం 12 మంది పోటీపడగా విశాఖపట్నంకు చెందిన సౌజన్య భాగవతుల విజేతగా నిలిచింది. ఫస్ట్ రన్నరప్‌గా హైదరాబాద్‌కు చెందిన జయరాం, సెకండ్ రన్నరప్‌గా సిద్ధిపేటకు చెందిన లాస్యప్రియ నిలిచారు. సంగీత దర్శకుడు తమన్, సింగర్స్ కార్తీక్, గీతా మాధురి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ ముగింపు వేడుకకు అగ్ర హీరో అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేతను ప్రకటించిన అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం చూస్తుంటే సంగీతంపై మరింత ప్రేమ పెరిగింది. ఇదొక మరచిపోలేని జ్ఞాపకంలా మిగిలిపోతుంది. రెండేళ్ల పాపకు తల్లిగా ఉంటూ సౌజన్య ఈ పోటీలో నెగ్గడం చాలా గొప్ప విషయం. పళ్లైన ప్రతీ స్త్రీకి భర్త సహకారం అందించాలి. అప్పుడే మహిళలు అనుకున్న లక్ష్యాల్ని సాధిస్తారు అన్నారు.