ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7, 8, 9 తేదీల్లో జరిగే ఈ మహాసభలకు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, సినీ సంగీత డైరెక్టర్లు హాజరవుతున్నారు. ఈ సభలను ఎంతో వైభవంగా నిర్వహించేందుకు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కన్వీనర్ రవి పొట్లూరి ఎంతగానో కృషి చేస్తున్నారు.

ఈ మహాసభల నిర్వహణ కోసం ఇప్పటికే పలు కమిటీలను ఏర్పాటు చేశారు. తానా సభలను విజయవంతం చేయడంలో భాగంగా పెద్త ఎత్తున ప్రచార కార్యక్రమాలను, ఆట పాటల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలకు తరలి రావాల్సిందిగా ఎంతోమంది ప్రముఖులను ఇప్పటికే తానా ప్రతినిధులు స్వయంగా కలిసి ఆహ్వానించారు.

తానా మహాసభలకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ప్రముఖ సినీనటుడు, మాజీ ఎంపీ, జయభేరి గ్రూప్ అధినేత మురళీ మోహన్, నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు హాజరవుతున్నట్టు అంజయ్య చౌదరి లావు, రవి పొట్లూరి తెలిపారు. ఈ మహాసభలను పురస్కరించుకుని ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


