తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు దర్శకులు ప్రభాకర్ జైనీ. జైనీ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి విజయలక్ష్మీ జైనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో, కాళోజీగా మూలవిరాట్ నటించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ కాళోజీ జీవించిన, ఆయన తిరిగిన ప్రదేశాల్లో వరంగల్,కరీంనగర్, హైదరాబాద్‌లో చిత్రీకరణ చేశాం. కాళోజీ సన్నిహితులను, బంధువులను, మిత్రులను కలిసి ఆయన గురించి సేకరించిన వివరాలను సినిమాలో పొందుపరిచాం. కాళోజీ జీవితం ఒక అనంత ప్రయాణం. ఆయన ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే కొన్ని సన్నివేశాలను మాత్రమే ఉదాహరణగా తీసుకుని, వారి జీవితం స్ఫూర్తి పొంది ఈ కథ రాసుకున్నాను. తప్పకుండా ఈ చిత్రం అందరి మెప్పు పొందుతుందనే విశ్వాసం వుంది అన్నారు.

ఈ చిత్రంలో పొట్లపల్లి శ్రీనివాసరావు, నాగిళ్ళ రామశాస్త్రి, విద్యార్థి, అంపశయ్య నవీన్, డాక్టర్ వీయస్ రెడ్డి, అన్వర్ తదితరులు ఈ సినిమాలో వారి పాత్రల్లో నటించారు. పీవీ నరసింహారావు పాత్రలో వారి సోదరుడు, పీవీ మనోహర్ రావు నటించారు. ప్రముఖ కవి తుమ్మూరి రామ్మోహన్ రావు, వైభవ్ సూర్య, శంకర్, మల్లికార్జున్, ప్రియ, రాధిక, నరేశ్, రజని, దేవేందర్ రెడ్డి, లాయర్ చౌహాన్ వంటి అనేక మంది నూతన, స్థానిక నటీనటులు ఇతర పాత్రల్లో నటించారు. జమీందారు పాత్రలో ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ వైయస్సార్ శర్మ నటించారు. సెప్టెంబరు 9న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్ ఆత్రేయ.

