ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో ఆయా రాష్ట్రాల్లోని నదులు, వాగులు, వంకల్లో వరద నీరు పొంగిపొర్లుతున్నది. యమునా నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దాంతో గడిచిన 45 ఏళ్లలో తొలిసారిగా చారిత్రక కట్టడమైన తాజ్ మహల్ పరిసరాల్లోకి యమునా నది వరద నీరు ప్రవేశించింది. తాజ్‌మహల్ గోడల్లో, గార్డెన్‌లో భారీగా వరదనీరు నిలిచింది. తాజ్‌మహల్ దగ్గర యమునా నది వరద గరిష్ఠ స్థాయి అయిన 495 అడుగులను దాటి 497.9 అడుగులకు చేరింది. దాంతో వరదనీరు తాజ్‌మహల్ పరిసరాల్లోకి ప్రవేశించింది. అయితే ఈ వరదనీరు వల్ల తాజ్‌మహల్‌కు వచ్చిన ముప్పేమీ లేదని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) వాళ్లు ప్రకటించారు.
