ఎన్నారైలు, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఆదాయపు పన్ను శాఖ కీలక సూచన చేసింది. ఆధార్ అనుసంధానించక పోవడం వల్ల పాన్ చెల్లుబాటులో లేని ప్రవాస భారతీయులు వెంటనే పన్ను అధికారులను సంప్రదించాలని సూచించింది. పలువురు ఎన్నారైలు తమ పాన్ పనిచేయడం లేదని ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఈ మేరకు ఐటీ శాఖ స్పందించింది. ఎన్నారైలు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ)లు వారి పాన్ పనిచేయకపోవడంపై ఆందోళన చెందుతున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. అయితే ఎన్నారైలు గత మూడు మదింపు సంవత్సరాల్లో ఏదైనా ఏడాది రిటర్నులు దాఖలు చేయకపోయినా, లేదా వారి నివాస స్థితిని తెలియజేయకపోయినా వారి పాన్ నిరుపయోగంగా మారినట్లు ఐటీ శాఖ తెలిపింది. కాబట్టి ఎవరైతే తమ నివాస స్థితిని తెలియజేయని ఎన్నారైలు ఉంటారో వారు తమ నివాస స్థితిని తెలియజేస్తూ జురిడిక్షన్ అసెస్‌మెంట్ ఆఫీసర్ ను సంప్రదించాలని ఐటీ శాఖ సూచించింది.
