అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ పేరు మీద ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద కార్యాలయం రికార్డును భారత్‌లోని ఓ కార్యాలయం తిరగరాయనుంది. గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాల వ్యాపారులకు చెందిన సూరత్ డైమండ్ బౌర్స్(ఎ్‌సడీబీ) కార్యాలయం ఈ ఏడాది నవంబరులో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇండియన్ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ బిల్డింగ్‌ను రూపొందించింది. సూరత్ డైమండ్ బోర్స్‌లో కట్టర్లు, వ్యాపారులు, పాలిషర్లు సహా 65 వేల మంది ఇక్కడ వ్యాపారం చేసుకునేందుకు వీలుగా నూతన కట్టడం నిర్మించారు. మొత్తం 35 ఎకరాల విస్తీర్ణంలో 9 దీర్ఘచతురస్రాకారంలో 15 అంతస్తుల భవనాలు నిర్మించారు. ఈ భవనాలన్నింటికి కూడా మధ్యలో మరో భవనం అనుసంధానంగా ఉంటుంది. దీనినే ఈ ఆఫీస్‌కు వెన్నెముకగా చెప్పొచ్చు.
ఇక ఈ కాంప్లెక్స్‌లో ఏకంగా 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రీక్రియేషన్ జోన్ సహా పార్కింగ్ కోసం కేటాయించారు. వేలాది మంది వ్యాపారం కోసం ముంబయి వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. అలాంటి వారి భద్రత, ప్రయోజనాల కోసం దీనిని నిర్మించాం అని అధికారులు వెల్లడించారు. ఈ ఎస్డీబీ పూర్తి నిర్మాణం నాలుగేళ్లలోనే పూర్తికావడం విశేషం.