భారతీయ అమెరికన్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. బిమల్‌జీత్ సింగ్ సంధుకు అమెరికాలో కీలక పదవి దక్కింది. వర్జీనియా గవర్నర్ గ్లెన్ యంగ్‌కిన్ సింగ్‌ను వర్జీనియా కామన్‌వెల్త్ యూనివర్సిటీ హెల్త్ సిస్టమ్ అథారిటీ బోర్డు సభ్యునిగా నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం బిమల్‌జీత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ పదవిలో ఆయన వర్జీనియా స్టేట్ హెల్త్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కీలక భూమిక పోషించనున్నారు. వర్జీనియాలో ఆరోగ్య వ్యవస్థ, మెడ్ స్కూల్, నర్సింగ్ స్కూల్, ఫార్మసీ స్కూల్ కార్యకలాపాలను పర్యవేక్షించడం ఈ బోర్డు డైరెక్టర్ల ప్రధాన విధి.ఇక తన నియామకంపై బిమల్‌జీత్ స్పందిస్తూ.. కీలక బాధ్యతలు దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తాము నిధుల సేకరణకు దిశానిర్దేశం చేస్తామని, వివిధ వైద్య కళాశాలలు, ఆస్పత్రులకు వ్యూహాత్మక మార్గనిర్దేశం చేస్తామన్నారు. తద్వారా వర్జీనియన్లకు ఉత్తమ సంరక్షణను అందిస్తామని బిమల్‌జీత్ చెప్పారు.
