చైతన్య రావు, లావణ్య జంటగానటించిన చిత్రం అన్నపూర్ణ ఫొటో స్టూడియో. చందు ముద్దు దర్శకత్వంలో యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకకు విశ్వక్‌సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వక్‌సేన్ మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్ బాగా నచ్చింది. హీరో చైతన్య మంచి కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా వెనక మా రెండేళ్ల శ్రమ ఉంది. ఈ కథ మిమ్మల్ని కొన్ని నెలల పాటు వెంటాడుతుంది. అంతటి హృద్యమైన భావోద్వేగాలుంటాయి. అందరూ థియేటర్‌లో సినిమాను చూడండి అన్నారు. ఈ కథ మీద నమ్మకంతో అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ వేశాం. అందరూ బాగుందని ప్రశసించారు. ఈ సినిమా విజయంపై టీమ్ అంతా చాలా నమ్మకంతో ఉన్నాం అని నిర్మాత యష్ రంగినేని చెప్పారు. ప్రతి ఒక్కరికి తమ జీవితాల్లో జరిగిన జ్ఞాపకాల్ని గుర్తుకు తెచ్చే చిత్రమిదని హీరో చైతన్య రావు పేర్కొన్నారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
