భారత సంతతికి చెందిన థర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ 9 వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. సింగపూర్ లోని 154 ఏళ్ల చారిత్రక అధికారిక భవనం ఇస్తానాలో భారత సంతతికి చెందిన చీఫ్ జస్టిస్ సుందరేష్ మీనన్ ఈ ప్రమాణస్వీకారాన్ని నిర్వహించారు. ఇస్తానా సింగపూర్ అధ్యక్షభవనంగా ఉంటోంది. ప్రధాని లీ సెయిన్ లూంగ్ , కేబినెట్ సభ్యులు, ఎంపీలు, ఉన్నతోద్యోగులు, దౌత్య ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. థర్మన్ పదవీకాలం ఆరేళ్లు. 2011 తర్వాత సింగపూర్‌లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో షణ్ముగరత్నం చరిత్ర సృష్టించారు. 66 ఏళ్ల రత్నం గతంలో సింగపూర్ మంత్రిగా పనిచేశారు. జపాన్‌చైనా వంశాల వారసురాలైన సింగపూర్ న్యాయవాది జానె ఇత్తోగిని థర్మన్ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు.
లండన్ స్కూల్ ఆఫ్‌ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన థర్మన్ హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేసన్‌లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. సీనియర్ మంత్రిగా, డిప్యూటీ ప్రధాన మంత్రిగా, ఆర్థిక మంత్రిగా పదవుల్లోనూ రాణించారు. ఐఎంఎఫ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ఫోరం వంటి అంతర్జాతీయ సంస్థల్లో కూడా పనిచేశారు. ఇంతవరకు సింగపూర్ అధ్యక్షురాలిగా హలీమా యాకోబ్ పదవిలో ఉన్నారు. ఈమె పదవీకాలం సెప్టెంబర్ 13తో ముగిసింది.