జానపద బ్రహ్మ బి.విఠలాచార్య దర్శకత్వం వహించిన సినిమా విశేషాలను నేటి తరం ప్రేక్షకులకు సమగ్రంగా పరిచయం చేస్తూ సీనియర్ సినీ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ జై విఠలాచార్య పుస్తకాన్ని రచించారు. మూవీ వాల్యూమ్ మీడియా ఆధ్వర్యంలో షేక్ జీలాన్ బాషా ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ జరిగింది. తొలి ప్రతిని రైల్వే ఉన్నతాధికారి రవి పాడి అందుకున్నారు.ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ చరిత్రను రికార్డ్ చేయడం తెలుగులో చాలా తక్కువ. ముఖ్యంగా తెలుగు సినిమా చరిత్ర తక్కువగా అందుబాటులో ఉంది. జానపదబ్రహ్మగా అభివర్ణించే విఠలాచార్య జీవిత ప్రస్థానాన్ని నేటితరానికి తెలియజేసే ఈ ప్రయత్నం అభినందనీయం అన్నారు.
రచయిత పులగం చిన్నారాయణ మాట్లాడుతూ ఈ పుస్తకం కోసం పలువురు సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేయడంతో పాటు విఠలాచార్య కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎన్నో విషయాలను సేకరించా. ఇప్పటివరకు ఎక్కడా అందుబాటులో లేని విస్త్రత సమాచారాన్ని ఈ పుస్తకలో పొందుపరిచాను అని తెలిపారు. రవి పాడి మాట్లాడుతూ సీనియర్ పబ్లిసిటీ డిజైనర్, రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీత ఈశ్వర్ గారి ఆఖరి పెయింటింగ్ తో ఈ పుస్తకం కవర్ పేజీ రూపొందింది. త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా ఈ పుస్తకం తొలి ప్రతిని అందుకోవడం సంతోషంగా ఉంది. పులగం చిన్నారాయణ గారు ఎంతో పరిశోధన చేసి, ఎంతో మందిని కలిసి విఠలాచార్య గారిపై పుస్తకం తీసుకు వచ్చారు. తెలుగు సినిమా చరిత్రను అక్షరబద్ధం చేస్తున్న ఆయన మరిన్ని పుస్తకాలు తీసుకు రావాలని కోరుకుంటున్నా అని చెప్పారు. షేక్ జీలాన్ బాషా మాట్లాడుతూ జర్నలిజంలో ఉన్న నేను ఈ పుస్తకంతో పబ్లిషర్ గా అడుగు పెడుతున్నందుకు గర్వంగా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ పుస్తకం కవర్ పేజీ ఆవిష్కరించారు. అదొక మరపురాని అనుభూతి. ఇప్పుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన త్రివిక్రమ్ గారికి థాంక్స్ అని చెప్పారు.