పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా నటించిన చిత్రం మంగళవారం. అజ్మల్ అమీర్ కథానాయకుడు. అజయ్ భూపతి దర్శకుడు. ఎం.సురేశ్‌వర్మ, స్వాతిరెడ్డి గునుపాటి నిర్మాతలు. ఈ సందర్భంగా పాయల్ విలేకరులతో ముచ్చటించారు. సార్ ఒక సినిమా ఇవ్వండి.. ఒక్కఛాన్స్ ప్లీజ్ అంటూ అజయ్‌భూపతి వెంటపడ్డాను. చిన్న చిన్న పాత్రలకు నిన్ను తీసుకోలేనని, మంచి పాత్ర వస్తే తప్పకుండా ఫోన్‌చేస్తానని మాట ఇచ్చారు. నటిగా నా పొటెన్షియల్, నా ట్యాలెంట్ ఆయనకు బాగా తెలుసు. సరైన కథ దొరికింది. దానికి తగ్గట్టు మంచి పాత్ర కుదిరింది. వెంటనే నాకు ఫోన్ వచ్చింది. ఈ సినిమా నా కెరీర్‌కే పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్మకంతోవున్నాను అని అన్నారు.
ఇండియాలో ఇప్పటివరకూ ఇలాంటి కథ రాలేదు. నేను చేసిన శైలూ తరహా పాత్ర కూడా ఎవ్వరూ టచ్ చేయలేదు. కథపరంగా ఇది సున్నితమైన పాయింట్. నా పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయ్. సినిమా చూశా క శైలూపై మీకు సింపతీ వస్తుంది అని పాయల్ అన్నారు. నిజజీవితంలో అస్సలు సంబంధంలేని పాత్రను ఇందులో చేశానని, శైలు పాత్ర గెటప్‌కే రెండుగంటలు పట్టేదని, అలాగే ఆ పాత్ర నుంచి బయటకు రావడానికి ఎక్కువ సమయం పట్టేదని, పదిహేనురోజులపాటు పాత్ర నుంచి బయటకి రాలేకపోయానని పాయల్ చెప్పారు . రాజీపడని నిర్మాతలు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేసిన ఈ సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా ఆమె నమ్మకం వెలిబుచ్చారు. ఈ నెల 17న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.