విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ ఢిల్లీలో సమావేశం అయ్యారు. హైదరాబాద్ హౌస్‌లో ఈ ఇద్దరి మధ్య సమావేశం జరగ్గా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడంపై ఆ ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. రెండు వైపులా కొత్త కాన్సులేట్స్, డైరెక్ట్ ఫ్లైట్ కనెక్షన్స్, విద్యా రంగంలో పురోగతితో పాటు ఇతర అనేక కార్యక్రమాలపై చర్చలు జరిగినట్టు తెలిసింది. ఈ సందర్బంగా విలేకరుల సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఊపందుకుంటోందని అన్నారు. పీఎం ఆంథోనీ అల్బనీస్ సెప్టెంబరులో జీ20 సమ్మిట్ కోసం భాతరదేశానికి వచ్చారని తెలిపారు. ఈ జీ20 సదస్సుకు అధ్యక్ష వహించేందుకు భారత్‌కు ఆస్ట్రేలియా బలమైన సహకారం అందించిందన్నారు. 14వ విదేశాంగ మంత్రి ఫ్రేమ్‌వర్క్ డైలాగ్ ఇప్పుడే ముగిసిందన్న ఆయన, తమ మధ్య గొప్ప సమావేశం సాగిందన్నారు. ఈ భేటీలో చాలా విషయాల గురించి చర్చించామని తెలిపారు. క్వాడ్ గురించి తాము వివరంగా చర్చించామని, కొన్నేళ్లుగా క్వాడ్ చాలా పురోగతి సాధించిందని అన్నారు. పరస్పరం సహకరించుకునే అంశాలు ఇంకా అనేకం ఉన్నాయని, ఈ చర్చలో తాము క్వాడ్‌కు ఇంకా ఏం జోడించగలమన్న దానిపైనే ఎక్కువగా చర్చలు జరిపామని చెప్పుకొచ్చారు.