దీపక్ సరోజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం సిద్ధార్థ్ రాయ్. వి.యశస్వీ దర్శకుడు. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో సిద్ధార్థ్ రాయ్ బాల్యం నుంచి ఇరవై ఏళ్ల వయసు వరకు జీవితాన్ని ట్రైలర్‌లో చూపించారు. ఓ దశలో ఎలాంటి భావోద్వేగాలు లేని సిద్ధార్థ్‌రాయ్ అనుకోని సంఘటనల వల్ల కోపస్వభావిగా, అహంకారిగా మారతాడు. అవే అతని పాలిట శత్రువులవుతాయి. ఈ నేపథ్యంలో అతను పడే సంఘర్షణతో ట్రైలర్ ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగింది. మల్టీపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో దీపక్ సరోజ్ మెప్పించాడు.
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మట్లాడుతూ ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు రాలేదని, ఈ తరహా సినిమాలు తీయాలంటే చాలా ధైర్యం కావాలన్నారు. దర్శకుడు వి. యశస్వీ మాట్లాడుతూ ఈ సినిమా చూసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌గారు తన బ్యానర్‌లో నా తదుపరి సినిమాకు అవకాశమిచ్చారు. సిద్ధార్థ్ రాయ్ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నాం అన్నారు. రొటీన్ కు భిన్నమైన కథతో తాము చేస్తున్న ప్రయత్నం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని నిర్మాతలు అన్నారు. తన క్యారెక్టర్‌లోని ఇంటెన్సిటీ ప్రతి ఒక్కరిని సర్‌ప్రైజ్ చేస్తుందని హీరో దీపక్ సరోజ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: రధన్, నిర్మాతలు: జయ ఆడపాక, ప్రదీప్‌పూడి, సుధాకర్ బోయిన, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వి.యశస్వీ.