లావణ్య త్రిపాఠి, అభిజిత్, అభిజ్ఞ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకుడు. ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఆద్యంతం చక్కటి వినోదంతో సాగే సిరీస్ ఇది. ప్రతీ పాత్ర నవ్వుల్ని పంచుతుంది. కాన్సెస్ట్ కూడా కొత్తదనంతో ఆకట్టుకుంటుంది. లావణ్య త్రిపాఠి పర్ఫార్మెన్స్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది అన్నారు.
అన్నపూర్ణ సంస్థ కొత్త టాలెంట్‌ను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. ఈ సిరీస్‌తో అదే ప్రయత్నం చేశాం. ఈ కథ లావణ్య త్రిపాఠికి పర్ఫెక్ట్గా కుదిరింది. చిన్న కథలో బలమైన పాత్రలు, భావోద్వేగాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి అని సుప్రియ పేర్కొంది. లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ఈ సిరీస్ మొదలుపెట్టినప్పుడు నేను మిస్ పర్ఫెక్ట్. సిరీస్ పూర్తయ్యే లోపు మిసెస్ పర్ఫెక్ట్గా మారాను (నవ్వుతూ). కొత్తదనంతో కూడుకున్న కథాంశమిది. టైటిల్‌కు తగినట్లే అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పింది. ఈ కార్యక్రమంలో సిరీస్ యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.