మణికందన్, శ్రీగౌరిప్రియ నటించిన తమిళ చిత్రం ట్రూ లవర్. ప్రభురామ్ వ్యాస్ దర్శకుడు. ఈ సినిమాను దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ట్రైలర్ను విడుదల చేశారు. మారుతి మాట్లాడుతూ ఓ జంట తమ ప్రేమను కాపాడుకునేందుకు ఎలాంటి సంఘర్షణను అనుభవించారనే అంశాన్ని ఈ సినిమాలో హృద్యంగా చూపించారు. దర్శకుడు అనుభవంలోంచి వచ్చిన కథ ఇది. దాదాపు ఆరేళ్లు కష్టపడి ఈ స్క్రిప్ట్ రాసుకున్నానని డైరెక్టర్ నాతో చెప్పాడు. ఇలాంటి చక్కటి ప్రేమకథను తెలుగు ప్రేక్షకులు మిస్ చేసుకోవద్దని కోరుతున్నా అన్నారు.
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను చూస్తున్నప్పుడు మేము తీసిన బేబి సినిమా గుర్తుకొచ్చింది. రెండు రోజుల ముందుగానే ప్రీమియర్స్ వేస్తున్నాం. ప్రేమలో ఉన్నవాళ్లు, ప్రేమించాలనుకునే వాళ్లందరూ ఈ సినిమాను తప్పకుండా ఇష్టపడతారు అని నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పానని హీరో మణికందన్ అన్నారు. ఈ నెల 10న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: శ్రేయాస్కృష్ణ, సంగీతం: సీన్ రోల్డన్, తెలుగు సంభాషణలు: మౌళి, తెలుగు రిలీజ్: మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్, రచన-దర్శకత్వం: ప్రభురామ్ వ్యాస్.