అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దేశాధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన, ఆయన బృందం మాజీ యూఎస్ కాంగ్రెస్వుమన్, హిందూ-అమెరికన్ నేత తులసి గబ్బర్డ్తో చర్చలు జరిపారు. విదేశాంగ విధానం, రక్షణ రంగం వంటివాటిలో సలహాలు ఇవ్వాలని ఆమెను ఆయన కోరారు. అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా ఆమె పోటీ చేసే అవకాశాల గురించి కూడా వీరు చర్చించారు. తులసి (42) నాలుగుసార్లు కాంగ్రెస్వుమన్గా పని చేశారు. 2020లో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి, ఓడిపోయారు. అనంతరం 2022లో ఆమె డెమొక్రాటిక్ పార్టీ నుంచి వైదొలగారు. ఆ తర్వాత ఆమె ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి దగ్గరవడం ప్రారంభించారు.