అర్జెంటీనా అధ్యక్షుడు జావియెర్ మిలీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. మరి కొద్ది నెలల్లో 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని జావియెర్ యోచిస్తున్నారు. ఆర్థికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. ఆ దేశంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒప్పందం త్వరలోనే ముగియనుంది.
గతేడాదే వీరి కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. అయితే, వీరి కాంట్రాక్ట్ ను రెన్యువల్ చేసే ఆలోచన తమకు లేదని అధ్యక్షుడు గతేడాది డిసెంబర్‌లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అర్జెంటీనాలో మొత్తం 35 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. అందులో తొలగించే ఉద్యోగు ల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వేల మందిని ఒకేసారి తీసేయాలని నిర్ణయించడమే ఆ దేశంలో ఇప్పుడు సంచలనమవుతోంది.