అమెరికాలో ఉద్యోగానికి వీలు కల్పించే హెచ్1బీ వీసా మరింత భారం కానున్నది. హెచ్1బీ సహా ఎల్1 ఈబీ 5 వంటి వలసేతర వీసా ఫీజులను అమెరికా భారీగా పెంచింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. 2016 తర్వాత ఈ మూడు వీసాల ధరలు పెంచడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట బైడెన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం, వీసా సేవలు, వలస విధానాలపై అంతర్జాతీయంగా ప్రభావం చూపనున్నది. హెచ్1బీ దరఖాస్తు ఫారం ఐ-129ను 460 డాలర్ల (రూ.38,000) నుంచి 780 డాలర్లకు (రూ.65,000) పెంచారు. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చే ఏడాది నుంచి 10 డాలర్ల (రూ.833) నుంచి 215 డాలర్లకు (రూ.18,000) పెరగనుంది. ఎల్1 వీసా ఫీజు 460 డాలర్ల (రూ.38,000) నుంచి 1,385 డాలర్లకు (రూ.1,15,000)కు పెరిగింది. ఈబీ 5 వీసా ఫీజు 3,675 డాలర్ల (రూ.3 లక్షలకు పైగా) నుంచి 11,160 డాలర్లకు (రూ.9.3 లక్షలు) పెంచుతూ బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.