శాంతిభద్రతలకు తోడు అస్థిర ప్రభుత్వాలు, సంక్షోభం వంటి సమస్యలతో సతమతమవుతున్న లిబియా దేశంలో తాజాగా జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆ దేశ ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేజా నివాసంపై రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది.ఈ ఘటనలో భవనం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఆ దేశ మంత్రి ఒకరు తెలిపారు. మరోవైపు పేలుడు ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రధాని నివాసం వద్ద భారీగా మోహరించాయి.
2011 నుంచి లిబియాలో రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పాలన కూడా రెండు వర్గాల చేతుల్లో ఉంది. 2014లో తూర్పు, పశ్చిమ ప్రాంతాలగా విడిపోయిన వర్గాలు ఎవరికి వారే సొంతంగా పాలన కొనసాగిస్తున్నాయి. సమస్యను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఐక్యరాజ్యసమితి 2021లో అబ్దుల్ హమీద్ నేతృత్వంలో నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, తూర్పు ప్రాంతంలోని పార్లమెంట్ ఆయనను అధికారికంగా గుర్తించేందుకు నిరాకరించకపోవడంతో అస్థిరత కొనసాగుతోంది.