భారత్‌లో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా జరుగుతాయని ఆశిస్తున్నామంటూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రతినిధి ఇటీవలే చేసిన వ్యాఖ్యలపై భారత్ ధీటుగా బదులిచ్చింది. భారత్‌లో ఎన్నికల గురించి ఐక్యరాజ్యసమితి తమకు చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం వంటి పరిణామాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు ఐరాస ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మాట్లాడుతూ భారత్ సహా ఎన్నికలు జరగనున్న ఏ దేశంలోనైనా ప్రజల రాజకీయ, పౌర హక్కుల రక్షణ ఉంటుందని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఓటు వేసే పరిస్థితులు ఉంటాయని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యలపై తాజాగా జైశంకర్ స్పందించారు.