ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మొజాంబిక్ ఉత్తర తీరప్రాంత సముద్రంలో ప్రమాదవశాత్తు మత్స్యకార పడవ మునిగిపోవడంతో 90 మందికిపైగా మరణించారు. ప్రమాద సమయంలో అందులో 130 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫెర్రీని చేపల పడవగా మార్చి సామర్థ్యానికి మించి ప్రయాణించడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారు లే ఉన్నారని నాంపుల ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ నెటో చెప్పారు. పడవ మునిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే సముద్రంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా మృతదేహాల వెలికితీత కష్టంగా మారిందని పేర్కొన్నారు. కాగా, కలరా వ్యాప్తిచెందుతుందంటూ వదంతులు రావడంతో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకొని దీవుల్లోకి వెళుతుండగా ఈ పడవ మునిగిందని జైమ్ నెటో తెలిపారు.