సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన చిత్రం టిల్లు స్కేర్. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. డబుల్ బ్లాక్‌బస్టర్ పేరు తో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. సక్సెస్‌మీట్‌కు అగ్ర హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ సిద్ధు నటించిన చాలా సినిమాలు చూశాను. కరోనా తర్వాతే ఆయన్ని వ్యక్తిగతంగా కలిశాను. సిద్ధుకి సినిమా అంటే విపరీతమైన పాషన్. తాను చేసే సినిమా గురించే ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. డీజే టిల్లుతో ప్రేక్షకులకు కలకాలం గుర్తుండిపోయే పాత్రను అందించాడు అన్నారు. టిల్లు మన ఇంటి మనిషిలా మారిపోయాడు. ఈ సినిమా చూసినప్పుడు ఇక నవ్వలేను బాబోయ్ అనుకున్నా. ఆ రేంజ్‌లో నవ్వించాడు. యువ హీరోలు విశ్వక్‌సేన్, సిద్ధులను చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. కొత్త కథలతో, కాన్సెప్ట్‌లతో ధైర్యంగా సినిమా చేసే ఇలాంటి డేర్ డెవిల్స్ ఇండస్ట్రీకి కావాలి. ఇక దేవర చిత్రం కాస్త లేటయినా మీరందరూ కాలర్ ఎగరేసేలా ఉంటుంది. ఆ సినిమాను గొప్పగా తీర్చిదిద్దుతున్నాం అన్నారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల క్రితం సిద్ధు నాకు ఈ కథ చెప్పాడు. అప్పటి నుంచి ఆ పాత్ర తోనే ప్రయాణం చేస్తున్నాడు. టీమ్ మొత్తం టిల్లు పాత్రను బలంగా నమ్మారు. అందుకే ఈ స్థాయి విజయం సాధ్యమైంది అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ఈ సినిమాపై ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్‌గారు ఓ మార్గదర్శిలా నిలిచారు. ఆయనతో కలిసి చేసిన ప్రయాణంలో ఎన్నో గొప్ప విషయాలను నేర్చుకున్నాను. నా వ్యక్తిగత జీవితం కూడా మారిపోయింది. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఓ ఓ ఫినామినన్. త్వరలో టిల్లు క్యూబ్ సినిమా కూడా చేయబోతున్నా అన్నారు.