ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం కల్కి 2898 ఏడీ. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా, మరో హీరోయిన్గా దిశా పటానీ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో చేస్తున్న మరో స్టార్ పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. భైరవ గా ప్రభాస్ నటిస్తోన్న ఈ చిత్రంలో అశ్వత్థామ గా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
అంతేకాదు, అశ్వత్థామ పాత్రను పరిచయం చేసేందుకు డిజైన్ చేసిన ఈ వీడియో కూడా అద్భుతంగా ఉంది. ఒక పిల్లాడితో నువ్వెవరు అని ప్రశ్నించేలా చేసి, స్వయంగా అమితాబే తన పాత్రను, ద్రోణాచార్య పుత్రుడైన అశ్వత్థామనంటూ పరిచయం చేసుకునే తీరును చక్కగా డిజైన్ చేశారు. అలాగే అమితాబ్ లుక్ కూడా వైవిధ్యంగా ఉంది. మ్యూజిక్, విజువల్స్ అన్నీ చాలా గ్రాండియర్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా అయితే ఈ టీజర్, మరోసారి ఈ సినిమా గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తోంది. ఈ చిత్రాన్ని 2024 మే 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.