ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హోమ్ నగరం శ్రీరామనవమి వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ది న్యూ బింగ్లి హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం సంప్రోక్షణతో మొదలైంది. అనంతరం ఉత్సవ మూర్తులకు పల్లకి సేవ నిర్వహించారు. 29 మంది కళాకారులతో కోలాటం నృత్యం, చిన్నారులు, భక్తజనం జైశ్రీరాం నినాదాల మధ్య పల్లకి సేవ కన్నుల పండువగా సాగింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన కాషాయ రంగులోని కాటన్ చీరలతో కళాకారుల కోలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.
హైదరాబాద్ నుంచి విచ్చేసిన అర్చకులు ముకురాల సిద్దార్త శర్మతో పాటు, స్థానిక అర్చకులైన మారుతి శ్రీనివాస్, శివ గోరుతో కలిసి కల్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వచ్చిన బ్రహ్మాశ్రీ చంద్రశేఖర్ శాస్త్రి తనయుడు మల్లాది రామానంద శాస్త్రి తనదైన వ్యాఖ్యానం ఆకట్టుకుంది. అనంతరం గజేంద్ర మోక్షంపై ఆయన ప్రవచనం ఇచ్చారు. ప్రసాదం వితరణ, భజనలతో అంతా సందడి వాతావరణం నెలకొంది. ఈ వేడుకకు విచ్చేసిన అతిథులకు తెలుగు వంటకాలతో పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. అలాగే భారత్, యూకే నుంచి విచ్చేసిన పలువురు నృత్యకారులు కూచిపూడి, భరతనాట్యం, డ్యాన్సులతో అలరించారు. ఈ వేడుకలను జయప్రదం చేసిన ప్రతిఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. యూకేలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 2,500 మంది విచ్చేసి భక్తి శ్రద్ధలతో రాములవారి కల్యాణోత్సవాన్ని తిలకించారు.