రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ ఏడాది జనవరి 25న ప్రకటించిన 132 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. ఐదుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మ భూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది పద్మ అవార్డు గ్రహీతల లో 30 మంది మహిళలు ఉన్నారు. అదేవిధంగా విదేశీ, ఎన్ఆర్ఐ, పిఐఓ, ఓసిఐ కేటగిరీకి చెందిన వారు 8 మంది పద్మ అవార్డులను అందుకున్నారు. మరణానంతరం 9 మందికి పద్మ పురస్కారాలు దక్కాయి.
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సామాజిక కార్యకర్త బిందేశ్వర్ పాఠక్ తరఫున ఆయన సతీమణి అమోలా పాథక్, కళా రంగానికి అందించిన సేవలకుగాను పద్మా సుబ్రమణ్యం తదితరులు పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, గాయని ఉషా ఉతుప్, ట్రేడ్ & ఇండస్ట్రీ విభాగంలో సీతారామ్ జిందాల్, వైద్య విభాగంలో తేజస్ మధుసూదన్ పటేల్ తదితరులు పద్మ భూషణ్ పురస్కారాలు తీసుకున్నారు. భజన గాయకుడు కలూరామ్ బమానియా, బంగ్లాదేశ్ గాయని రెజ్వానా చౌధరి, టెన్నిస్ ప్లేయర్ రోహన్ బొపన్న తదితరులు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు.
కాగా, పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, హోంమంత్రి అమిత్‌షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.