అమెరికా పౌరసత్వాన్ని పొందడంలో మెక్సికన్ల తర్వాత భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. 2022లో మొత్తం 65,960 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరసత్వాన్ని పొందినట్టు ఇండిపెండెంట్ కాంగ్రెషనల్ రిసెర్చ్ సర్వీస్ (సీఆర్‌ఎస్) విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2022 నాటికి అమెరికాలో 4.6 కోట్ల మంది విదేశీయులు నివసిస్తున్నారు. ఈ సంఖ్య అమెరికాలోని మొత్తం 33.3 కోట్ల జనాభాలో దాదాపు 14 శాతానికి సమానం. వీరిలో 2.45 కోట్ల మంది (53% మంది) అధికారికంగా అమెరికా పౌరులైనట్టు తమ స్థితిని నివేదించారు.
కాగా 2022లో అమెరికా పౌరసత్వం పొందిన విదేశీ సంతతి వారి సంఖ్య 9,69, 380 అయింది. వీరిలో అత్యధిక సంఖ్యలో మెక్సికన్లు తరువాతి స్థానంలో భారతీయులు, వరుసగా ఫిలిప్పినియులు, క్యూబావారు, డొమినిసి యన్ రిపబ్లిక్ వారు ఉన్నారని ఇండిపెండెంట్ కాంగ్రెషనల్ రిసర్చ్ సర్వీస్ వెలువరించిన నివేదిక తెలిపింది. ఇక ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్న మెక్సికన్ల సంఖ్య 10,638,429. తరువాతి స్థానంలో అత్యధికంగా రెండు లక్షలకు పైగా భారతీయులు ఉన్నారు. తరువాతి క్రమంలో చైనా వారు దాదాపుగా ఇదే సంఖ్యలో అక్కడ నివసిస్తున్నారని వెల్లడైంది.