అమెరికాలోని న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ ( ఏటీఏ) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు సంప్రదాయాలను కాపాడుకోవడం, వాటిని రేపటి తరాలకు అందించమే లక్ష్యంగా ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ ఉగాది వేళ తెలుగువారిని ఒక వేదికపైకి తీసుకొచ్చింది. దాదాపు 14 ఏళ్లుగా ఉగాది వేడుకల్ని నిర్వహిస్తోన్న ఆటా ఈసారి కూడా ఏప్రిల్ 21న అల్బానీలోని ఎంపైర్ స్టేట్ ప్లాజాలోని ది ఎగ్ బిల్డింగ్‌లోని హర్ట్ థియేటర్లో ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో పండుగను నిర్వహించింది. ఈ ఉత్సవాలకు ప్రముఖ సినీ నటుడు అలీ దంపతులు, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, బిగ్ బాస్ విన్నర్ కౌశల్ దంపతులు, సింగర్ సాయి ప్రియ అతిథులుగా హాజరయ్యారు.
ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అందరికీ షడ్రుచుల పచ్చడిని ప్రసాదంగా పంపిణీ చేశారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతి క కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఆర్పీ పట్నాయక్, సాయి ప్రియ పాటలు ఉర్రూతలూగించాయి. చిన్నారులు చేసిన డ్యాన్సులు అందరిలోనూ జోష్ నింపాయి.
ఈ సందర్భంగా అల్బనీ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ జాస్తి అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ ఉత్సవాలు ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన స్పాన్సర్లకు, అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.