అల్లరి నరేశ్ నటించిన చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. ఫరియా అబ్దుల్లా కథానాయిక. మల్లి అంకం దర్శకుడు. రాజీవ్ చిలక నిర్మాత. మే 3న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రానికి మాటలు రాసిన అబ్బూరి రవి విలేకరులతో మాట్లాడారు. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఏ వయసులో చేసుకోవాలి? ఎంత శాస్ర్తోక్తంగా చేసుకోవాలి? జీవితభాగస్వామిని ఎంచుకునే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ ప్రశ్నలపై నేటి యువతకు అవగాహన శూన్యం. పెళ్లి వ్యక్తిగతమే అయినా, సమాజానికి మాత్రం అది పెద్ద సమస్య. పక్కోడికి పెళ్లి కాకపోతే పొరుగువాడికి ఆనందం. పైగా బాధితుడు కనిపిస్తే సెటిల్ అయ్యావా? అని అడిగి, వాడ్ని బాధపెట్టి ఆనందపడే సమాజంలో మనం ఉన్నాం. సెటిల్ అవ్వడమంటే ఉద్యోగం, పెళ్లి కాదు. మనకు ఓ అవసరం వచ్చినప్పుడు పక్కవాడి దగ్గర చేయి చాచకపోవడం ఈ సినిమాలో నేను రాసిన డైలాగ్ ఇది. మొత్తంగా ఈ నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది అన్నారు.
పెళ్లి ప్రస్తుతం సీరియస్ ఇష్యూ. పెళ్లికాకపోవడంతో మానసికంగా కృంగుబాటుకు గురైన వారున్నారు. ఆత్మ హత్యకు తెగబడ్డవాళ్లూ ఉన్నారు. ఇలాంటి సబ్జెక్ట్‌ని వినోదాత్మకంగా చెబుతూనే, అందులోని ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలా చేశాం.దర్శకుడు మల్లీ ఈ టైటిల్ చెప్పినప్పుడు భయం వేసింది. ఈవీవీగారి క్లాసిక్ టైటిల్, ఇంత పెద్ద టైటిల్ అవసరమా? అనిపించింది. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఓకే అన్నాను అని పేర్కొన్నారు. కంటెంట్‌లో మేటర్ ఉంటే కామెడీ అద్భుతంగా రాయొచ్చనీ, ఇందులో అంతా సిట్యూవేషనల్ కామెడీనే ఉంటుందని ఆయన తెలిపారు. ఎలాంటి పాత్రనయినా చేసి మెప్పించగలిగేంత మంచి నటుడు అల్లరి నరేశ్ అనీ, దర్శకుడు మల్లీ ప్రతిభగల దర్శకుడనీ, సినిమాను జనరంజకంగా తెరకెక్కించాడని, చిలకా రాజీవ్ రాజీలేని నిర్మాణ విలువలు తెరపై కనిపిస్తాయని, ప్రతిఒక్కరికీ నచ్చే సినిమా ఇదని రవి నమ్మకం వ్యక్తం చేశారు.