ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆకాంక్షించారు. సంప్రదింపుల ద్వారా యుద్ధం ముగిసేలా కృషి చేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధమేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. రష్యాకు అయిదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలి విదేశీ పర్యటనకు చైనా ఎంచుకున్నారు.
రెండు రోజుల పర్యటనకు ఇక్కడకు చేరుకున్న పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. రష్యా`చైనాల మధ్య వ్యూహపరమైన బంధానికి అడ్డంకులు సృష్టించాలని అమెరికా చేసే ప్రయత్నాలను సాగనివ్వబోమని పుతిన్, జిన్‌పింగ్‌లు విడుదల చేసిన సంయక్త ప్రకటనలో పరోక్షంగా స్పష్టం చేశారు. తమ మైత్రి ఏ ఇతర దేశానికీ వ్యతిరేకం కాదని, కాబట్టి దానికి విఘాతం కలిగించే ప్రయత్నాలను వమ్ము చేస్తామని పేర్కొన్నారు. బీజింగ్‌లో పుతిన్, జిన్‌పింగ్‌ల సమావేశం సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్య, వ్యూహపరమైన సహకార అభివృద్ధికి పలు ఒప్పందాలు కుదిరాయి.