Namaste NRI

ఆ దేశంలో భారత విద్యార్థులపై దాడులు…. కేంద్రం అలర్ట్‌

కిర్గిజ్‌స్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో భారత్‌, పాక్‌, బంగ్లాదేశ్‌ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. స్థానికులు వైద్య కళాశాలల హాస్టళ్లపై హింసాత్మకంగా విరుచుకుపడటంతో ముగ్గురు పాక్‌ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయి నట్లు సమాచారం. భారత విద్యార్థులతో సహా మరికొందరు గాయపడినట్టు తెలుస్తున్నది. ఓ హాస్టల్‌ వద్ద పాక్‌, ఈజిప్ట్‌ సహా ఇతర దేశాల విద్యార్థులు, స్థానికుల మధ్య జరిగిన ఘర్షణ ఈ పరిస్థితికి దారి తీసినట్లు సమాచారం.

దీంతో బిష్కెక్‌ నగర వీధుల్లోనూ ఘర్షణలు జరిగాయి. విదేశీయుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. దౌర్జన్యానికి పాల్పడిన ముగ్గురు విదేశీయులను అదుపులోకి తీసుకు న్నామని పోలీసులు చెప్తున్నారు. పరిస్థితి సాధారణ స్థితికి చేరే వరకు విద్యార్థులు హాస్టళ్లలోనే అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తమను సంప్రదించాలని భారత్‌ ఎంబసీ భారతీయులను కోరింది.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు కిర్గిస్థాన్‌లోని భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. విద్యార్థులు ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. మన విద్యార్థుల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికి, విద్యార్థులు ఎవరూ బయటకు రావొద్దు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలి అని పేర్కొంది. ఈ మేరకు 24 గంటలపాటూ అందుబాటులో ఉండే ఫోన్ నంబర్‌ (0555710041)ను షేర్ చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం,  కిర్గిస్థాన్‌లో దాదాపు 14,500 మంది భారతీయ విద్యార్థులు నివసిస్తున్నారు.

Social Share Spread Message

Latest News