అమెరికాలో గడిచిన ఎనిమిదేండ్లలో హెచ్-1బీ వీసా దరఖాస్తులను ప్రముఖ భారత సాఫ్ట్వేర్ కంపెనీలు 56 శాతం తగ్గించేశాయి. 2015 ఆర్థిక సంవత్సరంలో 15,166 దరఖాస్తులకు అనుమతినివ్వగా 2023 నాటికి ఇది 6,732కు పడిపోయిందని అమెరికా మేధో సంస్థ నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ వెల్లడించింది.
అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీలు గడిచిన పదేండ్లుగా అక్కడి టెక్ నిపుణులనే ఉద్యోగులుగా చేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆటోమేషన్, ఏఐ వాడకం పెరిగింది. ఉద్యోగుల జీవన వ్యయానికి ఎక్కువ మొత్తం వెచ్చించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. హెచ్-1బీ వీసా దరఖాస్తులను కంపెనీలు తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలోనే ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడానికి కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.