సైనిక రహస్యాలతోపాటు పలు దేశాల అంతర్గత విషయాలను బట్టబయలు చేసి అగ్రదేశాలకు సైతం వణుకు పుట్టించిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే కథ సుఖాంతమైంది. ఐదేండ్లకుపైగా లండన్ జైల్లో గడిపిన అసాంజే ఎట్టకేలకు తన స్వదేశం ఆస్ట్రేలియా చేరుకున్నారు. అమెరికా సైనిక రహస్యాలను ప్రచురిం చిన నేరానికి మరియానా దీవుల రాజధాని సైపాన్‌లో అమెరికా జిల్లా కోర్టులో అసాంజేపై విచారణ జరిగింది. ముందస్తు ఒప్పందం ప్రకారం ఇప్పటికే జైలు జీవితం గడిపిన అసాంజేను విడుదల చేశారు. విచారణ నిమిత్తం లండన్ నుంచి సైపాన్ నగరానికి చార్టెర్డ్ ఫ్లయిట్‌లో వెళ్లిన అసాంజే, అదే విమానంలో ఆస్ట్రేలియా చేరుకున్నారు.
అసాంజేకు తోడుగా అమెరికాలో ఆస్ట్రేలియన్ రాయబారి, కెవిన్ రూడ్, బ్రిటన్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్ స్టీఫెన్ స్మిత్ వెళ్లారు. అసాంజే విడుదలలో వీరిద్దరూ కీలకపాత్రలు పోషించారు. వికిలీక్స్ పనులు కొనసాగుతా యని, వాక్ స్వాత త్య్రం, ప్రభుత్వంలో పారదర్శకత కోసం అసాంజే ముందుకు సాగుతారని ఆయన తరఫు న్యాయవాది బారీ పొల్లాక్ చెప్పారు.