అంజన్ కస్తూరి, సాంచి బార్తి జంటగా నటిస్తున్న చిత్రం దిల్ రెడ్డి. హైదరాబాద్‌లో ప్రారంభమైంది. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో అమ్మగారి రామరాజు (రమేష్) రూపొందిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు తనికెళ్ల భరణి క్లాప్‌నివ్వగా, భరద్వాజ్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకనిర్మాత అమ్మగారి రామరాజు మాట్లాడుతూ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. తనికెళ్ల భరణిగారు కీలక పాత్రలో కనిపిస్తారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా మెప్పిస్తుంది అన్నారు. హీరోగా తన తొలి చిత్రమిదని, సకుటుంబ సమేతం గా చూసి ఆనందించే కథాంశమని అంజన్ కస్తూరి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామచంద్రరావు, సంగీతం: షారుఖ్‌షేక్, నిర్మాణ సంస్థ: ధీరజ్ ప్రొడక్షన్స్.