Skip to main content

Namaste NRI

వలసదారులకు అమెరికా శుభవార్త

గ్రీన్‌ కార్డులు లేదా పర్మినెంట్‌ రెసిడెంట్‌ కార్డులు ఉండి వాటి రెన్యువల్‌ కోసం ఎదురుచూస్తున్న పౌరులు, వలసదారులకు అమెరికా శుభవార్త చెప్పింది. వారి పర్మినెంట్‌ రెసిడెంట్‌ కార్డుల చెల్లుబాటు కాలాన్ని మరింత పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. గతంలో ఈ కార్డుల కాల పరిమితి ముగిసిన తర్వాత మరో 24 నెలలు పొడిగించే వారు. ఇప్పుడు దానిని 36 నెలలకు పెంచారు. సాధారణంగా గ్రీన్‌కార్డు దారులు ప్రతీ ఐదేళ్లకోసారి వాటిని రెన్యువల్‌ చేసుకోవాలి. దానికోసం వారు ఐ-90 ఫామ్‌ను సమర్పించాలి. చట్టబద్ధమైన శాశ్వత నివాసితులై ఫామ్‌ ఐ-90ని సమర్పించిన వారి శాశ్వత నివాసి కార్డులు లేదా గ్రీన్‌ కార్డు చెల్లుబాటును 36 నెలల పాటు పొడిగిస్తున్నట్టు యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ప్రకటించింది. దీంతో రెన్యువల్‌ కోసం వేచి చూస్తున్న వారికి ఇది ఎంతో ఉపశమనం కలిగించింది. ఈ నిర్ణయం ఈ ఏడాది సెప్టెంబర్‌ 10 నుంచి అమలులోకి వస్తున్నట్టు తెలిపింది.

గ్రీన్‌ కార్డు గడువు ముగిసిన వారికి, పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. గడువు ముగిసిన గ్రీన్‌ కార్డుల రెన్యువల్‌కు ఏడు నుంచి 12 నెలల సమయం పడుతుంది. దాంతో అది వచ్చేవరకు పౌరులకు టెన్షన్‌ తప్పేది కాదు. ఈ ఎదురుచూపులకు అడ్డుకట్ట వేయడానికే గడువును 36 నెలలు పొడిగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Social Share Spread Message

Latest News