ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన ట్రంప్‌నకు అనుకూల సూపర్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (పీఏసీ)ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా మిచిగన్, విస్కాన్‌సిన్‌లలో రిజిస్టర్డ్ ఓటర్లకు స్వీప్‌స్టేక్స్ (లాటరీ) పథకాన్ని గత వారం ప్రారంభించారు. ఈ పీఏసీ ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణలకు మద్దతుగా సంతకం చేసే ఓటర్లకు బహుమతులు ఇస్తామని ప్రకటించారు.
ప్రతి రోజూ విజేతలను ప్రకటిస్తామని చెప్పినప్పటికీ, బుధవారం వరకు ఆ పని చేయలేదు. కానీ గురువారం ఈ రెండు రాష్ర్టాలకు చెందిన ఒక్కొక్క రిజిస్టర్డ్ ఓటరుకు 1 మిలియన్ డాలర్ల(సుమారు రూ.8 కోట్లు) చొప్పున బహుమతిని ఈ పీఏసీ ప్రకటించింది. ఈ డబ్బును ఓటర్ల రిజిస్ట్రేషన్ కోసం చట్టవిరుద్ధంగా ఇచ్చే ప్రోత్సాహకంగా పరిగణించే అవకాశం ఉందని న్యాయశాఖ హెచ్చరించినప్పటికీ మస్క్ సారథ్యంలోని పీఏసీ పట్టించుకోలేదు.