అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రమాదం పొంచి ఉందా? పెరుగుతున్న లీక్‌తో వ్యోమగాముల ప్రాణాలు ప్రమాదంలో పడనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లోని లీక్‌ను గుర్తించడంలో, సరిచేయడంలో నాసా, రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోమోస్ విఫలమవుతుండటం ఆందోళనకు దారి తీస్తున్నది. ఐఎస్‌ఎస్‌లో పెరుగుతున్న లీక్‌ను ‘ప్రధాన భద్రతా ముప్పు’గా నాసా సైతం తాజాగా పేర్కొన్నది. మరోవైపు ఐఎస్‌ఎస్‌ను వెంటనే ఖాళీ చేయకపోతే ప్రాణాంతక విపత్తుకు దారి తీయొచ్చని బ్రిటన్‌కు చెందిన నిక్ పోప్ అనే అంతరిక్ష నిపుణుడు హెచ్చరించారు. నాసా వేచి చూసే ధోరణితో ముప్పు ముంచుకొస్తున్నదని, ఇది వ్యోమగాముల ప్రాణాలతో పాటు, నాసా ప్రతిష్ఠను సైతం అంతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.