ఖలిస్థానీ తీవ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన నేపథ్యంలో భారత్ – కెనడా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో భారత్‌పై కెనడా ప్రభుత్వం తన అక్కసును వెల్లగక్కుతోంది. నిత్యం భారత ప్రధాని, భారత అధికారులపై ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంది. నిజ్జర్ హత్య వెనుక భారత ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖుల హస్తం ఉన్నదని కెనడాకు చెందిన భద్రతా సంస్థలు ఆరోపించాయని ఆ దేశ దినపత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు అంతంత మాత్రం ఉండగా, ఈ వార్తా కథనం దానికి మరింత ఆజ్యం పోసినట్లైంది. ఈ కథనాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ వార్తాకథనం హాస్యాస్పదం అంటూ తోసిపుచ్చింది. భారత్ ఆగ్రహంతో తాజాగా కెనడా వెనక్కి తగ్గింది.
న్యూఢిల్లీ ఆగ్రహంతో దిగొచ్చిన కెనడా ప్రభుత్వం మీడియాలో వచ్చిన కథనాలను కొట్టిపారేసింది. నిజ్జర్ హత్య కేసు కుట్రలో ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేర్లను తాము ఎన్నడూ ప్రస్తావించలేదని పేర్కొంది. వార్తాపత్రికలో వచ్చిన కథనాలు అవాస్తవమేనంటూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో భారతీయ అధికారులను నేరుగా దోషులుగా చూపే ఎలాంటి ఆధారాలు తమ వద్ద లేవని స్పష్టం చేసింది. దీనికి భిన్నంగా ఎలాంటి కథనాలు ప్రచురితమైన అవన్నీ ఊహాజనితం, అవాస్తవమేనని ట్రూడో సర్కార్ తమ ప్రకటనలో వెల్లడించింది.