అమెరికాలో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు లభించడం చాలా కష్టంగా మారింది. దీంతో అక్కడి భారతీయ విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో చాలా మంది విద్యార్థులు, ముఖ్యంగా తెలంగాణ, ఏపీకి చెందినవారు తమ ఆర్థిక అవసరాలను అధిగమించేందుకు అమెరికాలోని భారతీయ కుటుంబాల్లో ఆయాలు (బేబీ సిట్టర్లు)గా పని చేస్తున్నారు. అమెరికాలోని నిబంధనల ప్రకారం విద్యార్థులు క్యాంపస్‌లలో మాత్రమే పని చేయాలి. కానీ, అక్కడ రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరగడంతో చాలా మంది విద్యార్థులు క్యాంపస్ వెలుపల అక్రమంగా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయాల్సి వస్తున్నది.
ప్రస్తుతం అక్కడ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు లభించడం కష్టంగా మారడంతో చాలా మంది భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా యువతులు ఆయాలుగా పని చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. రోజుకు 8 గంటలపాటు ఆరేండ్ల బాలుడి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నానని, అందుకు గాను తనకు ఆ బాలుడి కుటుంబం గంటకు 13 డాలర్ల చొప్పున వేతనం చెల్లిస్తున్నదని, స్థానికంగా ఉన్న స్టోర్‌లోనో లేక పెట్రోల్ బంక్‌లోనో పని చేయడం కంటే ఈ ఉద్యోగమే బాగున్నదని ఓహియోలో చదువుతున్న ఓ హైదరాబాద్ విద్యార్థి తెలిపారు.